Globalization in Nani Poems

నానీ కవితలలో ప్రపంచీకరణ ~ డా .తలతోటి పృథ్వి రాజ్ 

       ప్రపంచంలోని ఆయా సంస్కృతులను , సంప్రదాయాలను, ఆర్థిక మూలలను , జీవన విధానాలను , సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నం చెయ్యడానికి అగ్రరాజ్యాలు పుట్టించిన , సృష్టించిన శక్తే ప్రపంచీకరణ .


       నేడు ప్రపంచంలో అన్నిదేశాలూ అనుసరిస్తున్న అతి ప్రధానమైన వాణిజ్యపద్దతే ఈ ప్రపంచీకరణ . ఈ ప్రపంచీకరణలో సరళీకరణ ,ప్రయివేటీకరణ అంతర్భాగాలుగా ఉంది పరస్పర ఆధారిత మార్కెట్ వ్యవస్థను సృష్టిస్తాయి . ప్రతీ దేశం  దేశంపై ఎగుమతులు దిగుమతుల విషయంపై ఆధారపడి ఉంటాయి . ఈ కీలకాంశమే ప్రపంచీకరణ పేరుతో అగ్రరాజ్యాలు ఆడుతున్న కుట్రకు మూలం . అభివృద్ధి  చెందిన దేశాలు వాటియొక్క మిగులు ఉత్పత్తిని అభివృద్ధి  చెందుతున్న మరియు వెనుకబడిన దేశాలకు ఒప్పందాలు, అంక్షలద్వారా ఎగుమతి చేస్తుంటాయి . ఇతర దేశాలనుండి అవి దిగుమతి చేసుకునే వస్తువులు చాలా స్వల్పం . అందువలన కృత్రిమ డిమాండ్ కల్పించడం , కృత్రిమ మద్యం సృష్టించడం వలన ప్రప్రంచ మార్కెట్ ను శాసిస్తూ అగ్రరాజ్యాలు కొనసాగిస్తున్నాయి .

       ప్రపంచ బ్యాంకు అగ్రరాజ్యాల ఆధిపత్యంలో నడపబడుతున్నందువలన అభివృద్ధి చెందుతున్న దేశాలు , వెనుకబడుతున్న దేశాలపై వివిధ ఆంక్షలు పెట్టి వాటిని సామాజికంగా , సాంస్కృతికంగా , ఆర్థికంగా ఎదగనియ్యకుండా చేయడమేగాక , వాటి వినాశనానికి పూనుకొని కబళించడానికి ప్రయత్నం చేస్తున్నాయి .

       తొంబయ్యో దశకంలో ప్రారంభమై భారతదేశంలో నెలకొన్న ఆర్ధిక అనిచ్చితి అన్నిరంగాలలో పొడచూపింది . ఆ స్థితినుంచి బయటపడడానికి ఆనాటి ప్రధాని పి. వి . నరసింహారావు ప్రపంచీకరణే సరైన మార్గమని ఆవైపు అడుగులు వేశారు  . అందుకే ~ “ప్రపంచీకరణ /బుసకొట్టే పాము/పాలుపోసింది/మా పాములపర్తే ” అని అన్నవరం దేవేందర్ తన నానిలో అంటాడు . ఇక్కడ కవి పివి నరసింహారావు గారి ఇంటిపేరైన “పాములపర్తి ‘ని దృష్టిలో పెట్టుకొని చక్కని నానీని రాశాడని చెప్పవచ్చు .

       ప్రపంచీకరణకు పుట్టిల్లు సామ్రాజ్యవాదం . సహజంగానే ప్రపంచాన్ని ఆర్థికంగా , సాంస్కృతికంగా  కబళించాలని శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది . అందుకే ~  “ఏమిటీ /ప్రపంచీకరణ / సామ్రాజ్యవాద విస్తృతికి /అందమైన తొడుగు “అని కొట్టి రామారావు అంటాడు . అనిశెట్టి రజిత ” జన జీవాలను //శ్రమ సారాలను /పీల్చే ఆక్టోపస్ /ప్రపంచీకరణ ” అని అంటే “తాడులేకుండానే /ఉరి /అర్థమైందా /గ్లోబలైజేషన్ అంటే ” అని డా. ఎస్ రఘు మొదలగు కవులు ,కవయిత్రులు ప్రపంచీకరణలోని సత్యాన్ని చాటారు .
“పాలనా బానిసత్వం /ఆధునికం మెరుగు /ప్రపంచీకరణం /వాణిజ్య ముసుగు ” అని శిరీష అనే కవి అంటాడు . “ప్రపంచీకరణ / ఒక పద్మవ్యూహం /అందరు బలి అయ్యే /అభిమన్యులే !” అని కథకుడు , కవి అయినా జి.రంగబాబు అంటారు .

       సామ్రాజ్యవాదానికి ముద్దుబిడ్డ ప్రపంచ బ్యాంక్ . బడుగుదేశాలకు అప్పులిస్తూ , తన అదుపు ఆజ్ఞల్లో ఆయాదేశాల ఆర్ధిక , సామాజిక ,సాంస్కృతిక ,విద్యా,వైద్య విధానాలను నియంత్రిస్తున్న వరల్డ్ బ్యాంక్ పై కూడా నానీ కవులు తమ ఆందోళనను నానీల రూపంలో వ్యక్తీకరించారు. ఎలా జరిగినా నష్టం మనకే అని తెలిపే “అరిటాకు `ముల్లు ” సామెతను గుర్తుకు తెస్తూ “వరల్డ్  బ్యాంక్ /మనమీద పడ్డా /మనం దానిమీద పడ్డా /కష్టాలు మనకే ” అని డా, ఎస్ ,రఘు రాయగా “అప్పుల ఊడలు దించుతూ /సామ్రాజ్య వాదం /ప్రపంచ బ్యాంకు /మంత్రాల మర్రి “అని జిందం అశోక్ అప్పుల ఊడలతో దేశదేశాలలో పాతుకుపోయి విస్తరించే మర్రిచెట్టులాంటి ప్రపంచబ్యాంకు దోపిడీని వర్ణిస్తాడు .

       ప్రపంచీకరణతో చేతివృత్తులూ దెబ్బతిన్నాయి . “చేయి విరిగిన /చేతి వృత్తులు /ప్రపంచీకరణ దూసిన/చురకత్తులు” అని కూకట్ల తిరుపతి అంటాడు . ప్రపంచీకరణతో ప్రధానంగా వ్యవసాయదేశమైన మన భారతదేశం, రైతుల జీవితం అగమ్యగోచరమైనది . “ప్రపంచీకరణ దెబ్బతో / వ్యవసాయం విలవిల /రైతుబ్రతుకు /దివాలా “అని పొనుగోటి నరసింహారావు అంటాడు . అంతేకాదు ; :సాగు భూమిని/’సెజ్ ‘ లు మింగేస్తున్నాయి /వ్యవసాయానికి /మరో గ్రహణం “అని భుజంగరావు సెజ్ ల పేరుతో సాగే దోపిడీని …కోల్పోయే వ్యవసాయ భూమిగూర్చి బాధను వ్యక్తం చేశారు .  సాగు భూమిని డాలర్లకోసమై రొయ్యల చెరువులుగా మలచడాన్ని నిరసిస్తూ ఇదే కవి “టైగర్ రొయ్యపై /డాలర్ వాలా / ఇక్కడి ప్రజలకు /అందని కల “అంటాడు .

       చివరికి చేతివృత్తులు చేసే చేనేత కళాకారులపై కూడా ఈ ప్రపంచీకరణ ప్రభావం పడింది . అందుకే ~”గుంత మగ్గాల్లో /గుంటనక్కలు దూరే /వాటితాత /గ్లోబల్ మృగం ” అని అనిసెట్టి రజిత చేతివృత్తులు పాడుచేసి యంత్ర పరిశ్రమలను నిరసించారు . అగ్రదేశాల ద్వందనీతిని “స్థలం మారితే / మాట మారుతుంది / ఇదీ ,ఆయుధాలమ్మేవాళ్ళ /విదేశాంగం “అని  విమర్శించారు కవి మంత్రి కృష్ణమోహన్

       మానవీయ విలువలు: గ్లోబలైజేషన్ తో మానవీయ విలువలు మృగ్యమైపోయాయి . మేలుకంటే కీడు ఎంతో జరుగుతుంది . అందుకే ~ “ఇప్పుడు ప్రపంచం /ఒక కుగ్రామం /మానవ సంబంధాలు మాత్రం /దూరం -దూరం “అని నేతల ప్రతాప్ కుమార్ అంటాడు .  ఉమ్మడి కుటుంబ విధానం  పతనమైపోయింది . తల్లిదండ్రుల పై ఆప్యాయతలు కనుమరుగై డాలర్లకై విదేశాలకు ఎగిరెళ్ళిపోతున్నారు నేటి పుత్రరత్నాలు . అందుకే ~ “గ్లోబల్ పేరెంట్స్ కి /పున్నామ ‘నరకం’/చూపించాడు/డాలర్ల కొడుకు “అని భుజంగరావు అనే కవి అంటాడు .

       ప్రపంచీకరణ మార్కెట్ లో మరో కోణం ఆడదాని అంగాంగాలను బహిర్గతం చేసి యాడ్స్ రూపొందించడం . ప్రతివిషయాన్ని మార్కెట్ సరుకు చేసి అమ్ముకునే సంస్కృతే పెట్టుబడిదారి సంస్కృతి . అందుకే ~ “అందాన్ని /మార్కెటీకరించారు /ఆడదిపుడు /అంగడి సరుకు “అని భుజంగరావు నిరసించాడు . అలాగే ~” రేజర్ యాడ్ కి /ఆడదాని గుడ్డలిప్పడం /మల్టీమీడియా /ఆర్ధిక సూత్రం ”  అనినేలపూరి వెంకట రత్నాజీ అంటాడు .

       ప్రపంచీకరణ పుణ్యమా అని మన దేశవాళీ పానీయమైన కొబ్బరి బోండాలకు తెగులు . కొబ్బరి బోండాలను ఇప్పుడు తాగడం మాని పురుగుల మందుతో కూడిన కూల్ డ్రింక్ లను తాగుతున్నారు జనం . అందుకే ~ “ప్రపంచీకరణ /మహత్యం /కోకా కోలా /కొబ్బరి బొండాను తాగేసింది ” అని మేడిశెట్టి గోపాల్ అంటే …”కూల్ డ్రింక్స్ లో /పురుగుల మందులు / మరి బ్రతుకుల్లో / బహుళజాతి చెదలు “అని బద్ది నాగేశ్వర రావు అంటారు . అన్యదేశాల ప్రపంచీకరణ కుట్రల్లో మనం మన సంస్కృతి, సంప్రదాయాల్ని , నాగరికతను కోల్పోతున్న వైనాన్ని అనేకమంది కవులు నానీలలో వ్యక్తం చేశారు . “ఆయుధాల్లేని /యుద్ధం / ఛానళ్ల దాడిలో / అందరూ క్షతగాత్రులే “అని డా. పత్తిపాటి మోహన్ టీవీలలో వస్తున్న విష సంస్కృతి,విచ్చలవిడి శృంగార దృశ్యాలను గూర్చి రాస్తే “విసిరాడు /విష సంస్కృతి వల /పాశ్చాత్య జాలరి /ఇంటర్నెట్ “అని డా. తలతోటి పృథ్విరాజ్ అంతర్జాలం ద్వారా విష సంస్కృతిని దేశంలో ప్రసారం చేస్తున్న పాశ్చాత్యుల దుర్బుద్ధిని నిరసించాడు .
       కలువకుంట రామకృష్ణ చెప్పినట్లు “పునాదుల్లేని /భవంతులేనా/ప్రపంచీకరణ /బహుమతులు” అని అందుకున్న చేదు ఫలాల్ని పరిశీలించి అంటాడు . ప్రపంచీకరణ ఎంతటి దుర్మార్గమైనదంటే …”నిన్ను నీకే /అమ్మేస్తుంది/గ్లోబల్ వ్యాపారం/మోసం అపారం “అంటాడు పి .లక్ష్మణ్ రావ్ .

       ఈ విధంగా ఎన్నో నానీలు ప్రపంచీకరణ నేపధ్యంగా నానీకవులు స్పందిస్తూ రాశారు. ప్రపంచీకరణ అనివార్యమై మన దేశంలో, దేహంలో భాగమే అయినా ఆ వికృత రూపాన్ని మన గుమ్మ దాటనివ్వకుండా, మన నట్టింటిలో తిష్టవేయనీయకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరమైతే ఉన్నదని అందరూ గ్రహించాలి