Interesting Facts Of Athreya

atreya

ఆత్రేయకు సంబంధించిన ఆసక్తికర సత్యాలు 

~ డా తలతోటి పృథ్వి రాజ్ , (ఆత్రేయ సాహితీ పరిశోధకులు )

ఆత్రేయ కలం పేరు:     

‘ఆచార్య ఆత్రేయ’ అనేది కలం పేరు. ఆత్రేయకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కిలాంబి వేంకట నరసింహాచార్యులు. ఆచార్య ఆత్రేయ పేరులోని ‘ఆచార్య’ అనే పదం బిరుదుగాని, విద్యార్హతను సూచించే పదంగాని కాదు. నరసింహాచార్యులనే పేరులోని ఉత్తర భాగమే ‘ఆచార్య’. ఇక ‘ఆత్రేయ’ అనేది వారి గోత్ర నామం. ఇలా ఆచార్య పదానికి గోత్రనామాన్నికలిపి “ఆచార్య ఆత్రేయ” అనే కలం
పేరును రూపొందించుకున్నారు ఆత్రేయ గారు
దేశభక్తునిగా:
        1942లో ఆత్రేయ చిత్తూరులో  ఉపాధ్యాయ శిక్షణ పొందుతూ “క్విట్  ఇండియా” ఉద్యమంలో పాల్గొనగా పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు. కొన్నాళ్ళు జైలు జీవితాన్ని గడిపిన దేశభక్తుడు ఆత్రేయ.
ఆత్రేయ ఉద్యోగాలు:
        ఆత్రేయ సినిమా రచయిత గాకముందు బ్రతుకుదెరువు కోసం అనేక ఉద్యోగాలు చేశారు. ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా లేడు. నెల్లూరు జిల్లా మున్సిఫ్ కోర్టులో కాపీయిస్ట్ గా కొన్నాళ్ళు,తిరుత్తని సెటిల్ మెంట్ ఆఫీసులో గుమస్తాగా కొన్నాళ్ళు, నెల్లూరు జిల్లాలోని ‘జమీన్ రైతు’ పత్రికకు సహాయ సంపాదకునిగా కొన్నాళ్లు, ఆంధ్ర నాటక కళా పరిషత్తులో వేతన కార్యదర్శిగా కొన్నాళ్ళు పనిచేశారు. సినిమా రచయిత అవకాశం కోసం మద్రాసు వచ్చిన తొలిదినాల్లో ఆత్రేయ కొన్నాళ్లు ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్మే ఉద్యోగం చేశారు.
ఆత్రేయ ప్రేమ వ్యవహారం:
వివాహానికి ముందు ఆత్రేయ బాణం అనే యువతిని గాఢంగా ప్రేమించాడు.  కొన్ని కారణాల చేత ఆమెను వివాహం చేసుకోలేకపోతాడు. పెద్దలను నొప్పించలేక వారు కుదిర్చిన ప్రకారం 1940 ఫిబ్రవరి 10వ తేదీన పద్మావతి గారిని వివాహం చేసుకున్నాడు. పెద్దల ఒత్తిడితో పెళ్ళైతే చేసుకున్నాడుగాని ప్రియురాలిని మర్చిపోలేక పోతాడు ఆత్రేయ. ఆత్రేయ ప్రేయసి పేరు ‘బాణం’. చక్కగా వీణను మీటేదట!  అందుకే ఆత్రేయ వీణపాటల రచన కు ప్రసిద్ధి.  మాయని ఆ ప్రేమ గాయాలే అనేక ప్రేమగీతాలు-సంభాషణల రచనకు ప్రేరణ అయ్యాయి. 
రాత్రేయ:
        ఒకసారి ఆత్రేయను కలవడానికి శ్రీశ్రీ గారు వచ్చి అక్కడున్న బొల్లిముంత శివరామకృష్ణ తో “రాత్రేయ ఉన్నాడా?” అని అడిగారంట. రాత్రేయ అని శ్రీశ్రీ ఎవరి గురించి అడిగాడా అనుకున్నారట!
కొద్దిసేపటి గాని శివరామకృష్ణ గారికి అర్థం కాలేదు శ్రీశ్రీ అలా ఎందుకు అన్నారో.  విశేషమేమిటంటే.. ఆత్రేయ రాత్రులే ఎక్కువగా రచన చేస్తాడట. ఆత్రేయ శిష్యుడు జె.కె.భారవి మధ్య జోక్. ” గురువుగారు తెల్లారైంది. ఇక నిద్ర పోదామా!” అనేవాడట భారవి.
బూత్రేయ:
        కొన్ని పాటలకు ఆత్రేయను కొందరు బూత్రేయ అని కూడా అనేవారు. ఒక సినీ రచయితగా తానూ అలా రావాల్సిన పరిస్థితి కి బాధపడుతూ… ” నా సినిమా సాహిత్యం గూర్చి కొన్ని నిజాలు చెప్పాలి.
నేను రాసినవన్నీ మంచివి కావు.  కొన్ని చెత్త పాటలూ రాసాను. కొన్ని బూతులుగా  ధ్వనించేవీ రాశాను.  సినిమా కవి బ్రతుకు అనేకానేక అభిరుచులుగల విటులను సంతృప్తి పరచవలసిన పడుపు వృత్తి” అని వివరణ కూడా ఇచ్చారు ఆత్రేయ. ‘ఎదురులేని మనిషి’ సినిమాలో ‘అబ్బా… దెబ్బ తగిలిందా…”  అనే పాటలో “తగలరాని తావులో తగిలింది” అని రాసిన ఆ లైన్ ను  అబ్జెక్ట్  చేస్తూ మీరు అంత పబ్లిక్ గా డెలిబరేట్ గా సెక్స్ రాస్తే ఎట్లాగండీ?  మీరెలా సమర్థిస్తారు దీన్ని?” అని సెన్సార్ బోర్డు చైర్మన్ అడిగాడట. ఏం చేయాలో పాలుపోని దర్శక, నిర్మాతలు పాట రాసిన ఆత్రేయ గారిని ఆర్గ్యుమెంట్ కి పంపిస్తారు. తగలరని చోటులో తగిలిందని రాసినందుకు మీరు అబ్జెక్ట్ చేశారు.  అసలు తగలవలసిన చోటులెక్కడో మీరు చెప్తే తగలరాని చోటేదో నేను చెప్తానని ఆత్రేయ వాదించారు.  ఆ వాదనకు సెన్సార్ బోర్డు వారు తెల్లముఖం వేశారట!. “బూతులు విషయానికి వస్తే అది రాయడం కూడా చాలామందికి చేత కాదు.  అది రాయడానికి కూడా చాలా టాలెంట్ కావాలి” అని మాటల రచయిత దివాకర్ బాబు అంటారు.
        ఆత్రేయకు చత్వారం వచ్చినా కళ్ళజోడు వాడేవారు కాదు. అతి చిన్న అక్షరాల్ని రాత్రులు చదవాల్సి వచ్చినప్పుడు మాత్రమేబూతద్దంలో చూస్తూ చదివేవారు. ఓసారి ఆత్రేయ అలా చదివే సమయంలో ఓ నిర్మాత వచ్చి ” ఏమిటి?… బూతద్దంలో చూస్తున్నారు” అని అడిగాడు. “నా రచనల్లో బూతు ఉందంటారుగా -వెదుకుతున్నా” అని ఆత్రేయ అన్నారట!
ఆత్రేయ డిక్టేటర్:
అవును!. ఆత్రేయ డిక్టేటరే! హిట్లర్ లాంటి డిక్టేటర్ కాదు ; ఆయన డిక్టేట్ చేస్తూ ఉంటే తన అసిస్టెంట్స్ రాస్తూ ఉంటారు. అలాగ ఆయన డిక్టేటరే !
        ఒకసారి శ్రీ మోదుకూరి జాన్సన్ ఆత్రేయను కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ “నేను మీ అడుగు జడలలోనే నడుస్తున్నాను. నిర్మాత ముందుగా డబ్బిస్తేగాని రాయడం లేదు గురువుగారు”అన్నాడట. “పిచ్చివాడా , నేను డబ్బిచ్చినా రాయడం లేదు. ఆ సంగతి నీకు తెలియదేమో పాపం “అన్నారట ఆత్రేయ నవ్వుతూ…
        ఆత్రేయకు ఒకరోజు పావలా దొరికితే దాంతో ఒక ఎక్సర్ సైజ్ పుస్తకం కొని వీథి దీపం క్రింద కూర్చొని “గౌతమబుద్ధ “నాటకం రాసి ఒక ప్రచురణ కర్తకు చూపించగా ఆతనికి నచ్చి 50 రూపాయలు పారితోషకం ఇవ్వగా అదే పదివేలుగా భావించి ఆత్రేయ పుచ్చుకున్నాడట !
 
ఆత్రేయ దుర్భర జీవితం :
        ఒక జత వస్త్రాలతో కాలం గడుపుతూ నాటకాలకు ఉపయోగించే తెరలు చుట్టుకొని దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు ఆత్రేయ . అప్పుడప్పుడు ఆత్రేయకు పావలా బేడా టిఫిన్ చెయ్యమని ఇచ్చేవాడట హాస్యనటుడు రమణారెడ్డి. ఆత్రేయ సినీకవిగా లక్షలు ఆర్జించినా చివరి దశలో దుర్భర పరిస్థితుల్ని అనుభవించారు. ఎంత ఆర్థిక దుస్థితి అంటే -“కీర్తి ప్రతిష్టల్ని తాకట్టు పెట్టుకునేవాడు ఎవడన్నా ఉంటే బాగుండయ్య “అని మతాల రచయిత దివాకర్ బాబుతో అనేవాడట ఆత్రేయ ! 
ఆత్రేయ విశ్వాసాలు:
        ఆత్రేయ గారి పాటలు, సంభాషణలను బట్టి ఆయనను కొందరు హేతువాదిగా, నాస్తికునిగా భావిస్తారు.  అతనికున్న కొన్ని నమ్మకాలను బట్టి ఆత్రేయకూడా అందరిలాంటి వాడేనని అందరికీ అర్థమవుతుంది. ఎప్పుడూ మే 7వ  తేదీన పుట్టినరోజు చేసుకునే ఆత్రేయ తిథి, వార నక్షత్రాలు అన్నీ కలిసి వచ్చాయని మే 21వ తేదీన తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నట్లు ఆత్రేయ స్వయంగా వెల్లడించాడు.  ఆత్రేయకు సంఖ్య శాస్త్రం మీద పిచ్చి నమ్మకం.  ఆత్రేయకు నాడీ జ్యోతిష్యం పై గొప్ప విశ్వాసం. 
ఆత్రేయ తొలి చివరి పాటలు మాటలు:
        రచనా క్రమం రీత్యా “దీక్ష” చిత్రంలో “పోరా బాబు పో” అనే పాట మొదటిది కాగా “ప్రేమయుద్ధం “లోని “ఈ మువ్వల గానం మన ప్రేమకు ప్రాణం” అనే పాట ఆత్రేయ గారి చివరి పాట. ఆత్రేయను పాటల రచయితగా తన “దీక్ష”(1951) చిత్రంతో పరిచయం చేసిన దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు గారు.  అదే చిత్రానికి ఆత్రేయను మాటల రచయితగా కూడా పరిచయం చేశారు.
     తాపీ ధర్మారావు, ఆత్రేయ  “దీక్ష ” చిత్రానికి సంయుక్తంగా సంభాషణలు సమకూర్చారు.  మాటల రచయితగా ఆత్రేయగారు చివరిగా సంభాషణలు సమకూర్చిన చిత్రం “లైలా”(1989).
        డాక్టర్ చక్రవర్తి సినిమా లో శ్రీశ్రీ రచించిన “మనసున మనసై బ్రతుకున బ్రతుకై” అనే మనసు పాటలు బట్టి అది మనసు కవి ఆత్రేయ రాశారని, “తోడికోడళ్లు ” సినిమాలో ఆత్రేయ రచించిన “కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడీదాన ” అనే అభ్యుదయ గీతాన్ని బట్టి దీన్ని శ్రీ శ్రీ రాశారని చాలామంది పొరబడుతుంటారు.  ఆత్రేయ సుమారు రెండు వేల పాటలు,  రెండు వందల సినిమాలకు మాటలు రాశారు.
ఆత్రేయ బిరుదులూ-పురస్కారాలు:
        ఆత్రేయ మనిషి, మనసు, మమత అనే పదాలను విడిచిపెట్టకుండా మాటలు -పాటలు రాస్తుంటారు కనుకనే ఆయనకు మన’సు’కవి అని  పేరు వచ్చింది. ఇది ప్రజలిచ్చిన బిరుదుగా ఆత్రేయ భావించారు.  1989 మే 5వ తేదీ ఆంధ్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు ఆత్రేయగారికి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు.        తమిళ చిత్ర పరిశ్రమలో ఆత్రేయలాంటి గొప్ప రచయిత కన్నదాసన్. ఒకోసారి వీరిరువురు ఒకరి భావాలు ఒకరు షేర్ చేసుకునే వారట! అందుకే ఆత్రేయను “ఆంధ్రా కన్నదాసన్” అనేవారు. నాటక రంగంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆత్రేయ.  నాటక రచయితగా ఆత్రేయను “ఆంధ్ర ఇబ్బన్”  అని అంటారు. “సతీ సావిత్రి ” టైటిల్ కార్డులో “కవితా సుధానిధి “గా ఆత్రేయను చిత్ర దర్శకుడు పేర్కొన్నారు. 
ఆత్రేయ స్క్రిప్ట్ గూర్చి:
 తెలుగు సినిమా స్క్రిప్ట్ కు స్వరూపాన్ని ఇచ్చినవారు ఆత్రేయ.  సినిమా సంభాషణలు రాసే ముందుపేపరును పై భాగంలో “శ్రీ విఘ్నేశ్వరాయ నమః “అని రాసేవారు. పేపరును నిలువుగా సగ భాగానికి మడిచి ఎడమవైపు ఎర్ర సిరాతో యాక్షన్ పార్ట్ ను,  కుడివైపు నీలిరంగు సిరాతో సంభాషణలు రాసేవారు
        రాసి ప్రేక్షకుల్ని రాయక నిర్మాతలను ఏడ్పిస్తాడని ఆత్రేయ మీద ఒక పెద్ద విమర్శ.  నిజమే!.  తాను అనుకున్నది మనసులో నుంచి వచ్చే వరకు రోజులు…  నెలలు పట్టవచ్చు! అప్పుడే పేపర్ మీద పెడతాడు. సముద్రమంత మథనం జరగాలి.  అలా ఆత్రేయ రాసిన మాటలు ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టిస్తాయి.  సెంటిమెంట్ సంభాషణలు రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి.  లేడీస్ సెంటిమెంట్ లేకపోయినా సెంటిమెంట్ ఆత్రేయ బాగా రాస్తాడని శ్రీశ్రీపొగిడేవాడట! 
సినిమా స్క్రీన్ ప్లే పై ఆత్రేయకున్న పట్టు :
        ఆత్రేయ గారికి సినిమా స్క్రీన్ ప్లే పట్ల ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. “జీవనతరంగాలు” సినిమా తీసే ముందు బ్యాగ్రౌండ్ సాంగ్ పెట్టాలనే ఆలోచనలో లేరు దర్శక-నిర్మాతలు.  సెట్టింగ్ లో స్టోరీ చర్చిస్తుండగా ఆత్రేయ గారు అక్కడికి వచ్చారు.  కథానాయిక తల్లి చనిపోయిన తర్వాత ఆ సీన్ కట్ చేస్తే ఆ తర్వాత చితి,ఫ్లేమ్ ను సీన్ గా చూపిద్దామని అనుకుంటుండగా ఈ రెండింటికి మధ్య బ్యాగ్రౌండ్ టైటిల్ సాంగ్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి పాట రాసుకొని తీసుకు వస్తాడు ఆత్రేయ.  పాట బాగానే ఉంది మరి ఎలా చిత్రీకరించాలో మాకు అర్థం కావట్లేదని వారు అంటే ఆత్రేయ ఇలా వివరిస్తాడు. ఈ  సినిమాలో కథానాయిక పేరు రోజా.  ఆమె తమ్ముడు చందు.  దొంగతనం అతని అలవాటు. చందుని ఒక సారి పోలీసు వెంబడిస్తుంటే వారి నుండి తప్పించుకోవడానికి ఒక శవాన్ని మోసికెళ్ళే గుంపులోకి వెళ్లి వాళ్లలోని ఒకరిని తప్పుకోమని అతని భుజానికి పాడెను ఎత్తుకుంటాడు.  పోలీసులు వెళ్ళగానే  మళ్ళీ వెళ్ళిపోతాడు.  ఇక్కడే- ” మమతే మనిషికి బందిఖానా/భయపడి తెంచుకు పారిపోయినా/తెలియని పాశం వెంటబడి/ఋణం తీర్చుకోమంటుంది/ నీ భుజం మార్చుకోమంటుంది” అని సాహిత్యానికి దృశ్యాన్ని సమన్వయం చేస్తాడు. అదీ ఆత్రేయ గొప్పతనం!
ప్రకృతి సౌందర్యపు తావుల్లో రూపుదాల్చే ఆత్రేయ పాటలు- మాటలు:
        ఆత్రేయ సుందర ప్రదేశాలలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పాటలు-సంభాషణలు రాయడానికి ఎక్కువ ఇష్టపడతాడు.  సినిమా సన్నివేశానికి సంబంధించిన భావుకత ప్రేరణకై  ఎక్కువగా రాత్రివేళ మద్రాస్ మెరీనా బీచ్ కుఆత్రేయ వెళ్లేవారట ! “వెలుగు నీడలు ” చిత్రానికి ఆత్రేయ చేత మంచి సంభాషణలు రాయించుకోడానికి డి మధుసూదన్ రావు గారు ఆత్రేయ గారికి ఒక కారు,  అసిస్టెంట్ డైరెక్టర్ కె. వి. రావు,  డ్రైవర్, బోయ్ ను అప్పగించి కేరళలోని పీచీ డ్యామ్ గెస్ట్ హౌస్ కు పంపించాడు.  నెల రోజులకు ఆత్రేయ స్క్రిప్ట్ అప్పజెప్పాడట! “మధుర స్వప్నం” సినిమాకు మాటలు రాసింది ఆత్రేయ.  ఆ సినిమా క్లైమాక్స్  గోదావరి నదిలో పడవ మీద రాస్తానంటే ఆ చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు గారు ఆత్రేయకు డిక్టేట్ చేసేవి రాయడానికి సహాయకునిగా మాటల రచయిత ఆకేళ్లను ఏర్పాటు చేయించి రాయించారు.
విచిత్ర ఆత్రేయ తత్వం:
        ఐదు వందల అడ్వాన్స్ అరువుకోసం దర్శక నిర్మాతలదగ్గరకు టాక్సీలో తిరిగి 300 టాక్సీ కి ఇచ్చి 200 మిగుల్చుకున్న రోజులు ఆత్రేయ జీవితంలో ఎన్నో …!  ఆత్రేయకు డబ్బులున్నా నిద్ర పట్టదు; డబ్బులు  లేకపోయినా నిద్ర పట్టదు. డబ్బులుంటే నిద్రాహారాలు మనైనా సరే ఆ డబ్బు ఖర్చు అయేవరకు ఏదోఒకటి కొనేవారు.  డబ్బు లేకపోతే ఏదో ఒక నిర్మాత దగ్గర డబ్బు ముట్టేదాకా తిరుగుతూ ఉండేవారట.  ఆత్రేయ కొత్త కొత్త వస్తువుల మీద వ్యామోహం ఎక్కువ. ఖరీదైన ఫైల్స్, కాగితాలు, వాచీలు, సిగరెట్లు, సెంట్లు, సిల్కు బట్టలు మొదలగు వాటికి డబ్బంతా తగలేసేవారట.
సహృదయతకు తార్కాణం ఆత్రేయ :
      తాను దర్శక-నిర్మాతగా నిర్మించిన “వాగ్దానం” చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు “దాశరధి”ని పాటల రచయితగా పరిచయం చేసిన సహృదయుడు ఆచార్య ఆత్రేయ.
బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఆత్రేయ:
      ఆత్రేయ గొప్ప నాటక రచయితగా,ప్రయోక్తగా, దర్శకునిగా, నటునిగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండటమే గాక, “వాగ్దానం” చిత్రానికి దర్శక-నిర్మాతగా,రుణానుబంధం,  దేశమంటే మట్టికాదోయ్”  మొదలైన చిత్రాలకు కథారచయితగా “మూగ మనసులు” చిత్రానికి ఆత్రేయ-ముళ్ళపూడి వెంకటరమణ, డాక్టర్ ఆనంద్ చిత్రానికి ఆత్రేయ-వి.మధుసూదనరావు,  “వాగ్దానం” చిత్రానికి ఆత్రేయ-బొల్లిముంత శివరామకృష్ణ, “తోడికోడళ్ళు”  చిత్రానికి ఆత్రేయ-ఆదుర్తి సుబ్బారావు గార్లు కథానుసరణలు చేశారు.  సతీసావిత్రి, ఆదర్శ కుటుంబం చిత్రాలకు ప్రత్యగాత్మ-ఆత్రేయ, “మంచి మనసులు” చిత్రానికి ఆదుర్తి- ఆత్రేయ, “కన్నతల్లి” చిత్రానికి జగన్నాథం -ఆత్రేయ స్క్రీన్ ప్లేలు సమకూర్చారు.
సినీ నటునిగా ఆత్రేయ “కోడెనాగు” “ఆదర్శం” చిత్రాల్లో నటించాడు. “కోడెనాగు”చిత్రంలో రామశర్మ పాత్రల్లో నటించారు. “భామాకలాపం”  చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. అపర శ్రీనాధునిగా ఆత్రేయను చెప్పుకోవచ్చు. భోగాలు అనుభవించాడు-చివరి దశలో పరమ దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఆత్రేయ దర్శక-నిర్మాతగా “వాగ్దానం” చిత్రాన్ని నిర్మించి ఆర్థికంగా నష్టపోయాక మరెప్పుడూ సినిమాలు తీయనని “వాగ్దానం” చేశాడట!
తెలుగు చిత్ర పరిశ్రమలో “అ”త్రయం  అంటే అద్భుతం.  ఆదుర్తి సుబ్బారావు, ఆచార్య ఆత్రేయ, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ విజయవంతమే! ఉదాహరణకి డాక్టర్ చక్రవర్తి, మాంగల్యబలం, మంచి మనసులు, వెలుగు-నీడలు, మూగమనసులు.
సంచలనం సృష్టించిన లేఖ:
      ఆత్రేయ గారి తత్వంతో విసిగిపోయిన పద్మావతి గారు కోపంతో ఆయనకు ఒక ఉత్తరం రాసింది  మీరు ఆత్మకథ రాస్తున్నారని విన్నాను. ఊరికే ఆత్మ కథ రాయడం కాదు; ఇంకో మనిషి చేసిన అన్యాయం గూర్చి కూడా రాయండి అని లేఖ రాసి పోస్ట్ చేసింది. ఆ విషయం అంతటితో మరిచిపోయింది ఆత్రేయ భార్య పద్మావతి. ఆ లేఖ అందుకున్న ఆత్రేయ  కోపగించి ఆమె 1976 రాసిన లేఖ 1989లో ఆత్రేయ చనిపోయిన తర్వాత ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడినది. ఇది వారికెలా చేరిందంటే – భార్య రాసిన లేఖను అందుకున్న ఆత్రేయ ఆత్మకథలో రాయడం కాదు, కావాలంటే పేపర్లోనే ఇస్తానని “ఆంధ్రజ్యోతి” వారికి ఆ లేఖను సీల్ చేసి ఇచ్చి తాను చనిపోయిన తరువాతే బయటకు తీసి దానిని పేపర్లో ప్రచురించమని ఆత్రేయ వారి వద్ద మాట తీసుకొని చెప్పాడట మాట తీసుకొని చెప్పాడట! మంచైనా చెడైనా దాపరికం లేని మనిషి ఆత్రేయ
ఆత్రేయ నిజజీవితంలో సమయస్ఫూర్తితో హాస్యస్ఫోరకంగా వ్యంగ్యంగా మాట్లాడగలుగుతాడు గాని హాస్య సంభాషణా రచన చేయలేడు.   సినిమా రచయిత ఆత్రేయ రాయలేనిది ఏదైనా ఉన్నదంటే అది హాస్య సంభాషణలు ఒక్కటే! అందుకే కొన్ని చిత్రాల్లో హాస్య సన్నివేశాలకు సంభాషణలను అప్పలాచార్య, కొర్రపాటి గంగాధరరావు లాంటి వారి చేత దర్శక-నిర్మాతలు రాయిస్తారు.  అందుకే- ఆత్రేయ కామెడీ మేకింగ్ లో దిట్ట అయినప్పటికీ రైటింగ్ లో డల్” అని సినీ పరిశ్రమలో కొందరు అంటుండేవారు.  మే 7, 1921 లో జన్మించిన ఆత్రేయ, సెప్టెంబర్ 13, 1989 బుధవారం రాత్రి 11 గంటలకు మరణించారు.
      (డాక్టర్ పృద్వి రాజ్ హైకూ కవి, ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆత్రేయ సాహితీ స్రవంతి వ్యవస్థాపకులు. “ఆత్రేయ  సినిమా సంభాషణలు- ఒక పరిశీలన” అనే అంశం పై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి 2000 సంవత్సరంలో పి.  హెచ్ డి పట్టాను పొందారు.  “మన’సు’కవి, ఆత్రేయ నాటక సాహిత్యం-సంభాషణలు” అనే విశ్లేషణాత్మక గ్రంథాలను రచించారు.  ఆత్రేయ గారి సినిమా పాటలు, మాటలమీద  అనేకమైన ఆడియో, వీడియో సీడీలను రూపొందించారు. ఆత్రేయ సాహిత్యానికి సంబంధించిన అనేక అంశాలపై వీడియో డాక్యుమెంట్స్ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఆత్రేయ అభిమానులు వీక్షించేందుకు యూట్యూబ్ అనే వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది.  ఆత్రేయ సాహిత్యాన్ని పి. డి. ఎఫ్.  ఫార్మాట్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొదలగున్న విధానాలలో  అందరికీ అందుబాటులో ఉండేలా సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ  కృషి చేస్తున్నారు.  acharyaathreya.blogspot.com అనే బ్లాగ్ ను  నిర్వహిస్తూ ఆత్రేయ సాహిత్య విస్తృతికి పాటుపడుతున్నారు.  డా తలతోటి  పృథ్వి రాజ్ ఆత్రేయ సాహిత్యంశాలపై  పలు వేదికలపై ఉపన్యాసాలిచ్చారు.  ఆత్రేయగారి 24వ వర్ధంతిని పురస్కరించుకొని “భావ తరంగిణి”  పాఠకుల కోసం ఆత్రేయ గారికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పృథ్వీరాజ్ ఇలా వ్యాసంగా తెలియజేశారు. ఈ విషయాలు మిమ్మల్ని ఆనందింప చేయగలవని ఆశిస్తున్నాను )